Friday, July 3, 2020

దేవుని దృష్టిలో దేవుని క్షమాపణ



1. దేవుడే క్షమించు ప్రక్రియను ప్రారంభించాడు (1 యోహాను 4:19). 


ఆదాము సంతానంగా, మనము పాపులముగా పుట్టాము. మనము పాపులముగా ఎదిగాము. పాపము చేయుట మన సహజ స్వభావం. పాపం చేయుట ద్వారా మనము పాపులము కాలేదు - మనము పాపులము కాబట్టి పాపం చేసాము. మనము శాశ్వతమైన మరణానికి గురియైయుంటిమి. మనము రక్షించబడాలని అనుకోలేదు.  మరియు రక్షింపబడటానికి మనకు మార్గం కూడా లేదు. కానీ దేవుడు తన దయతో మనలను రక్షించడానికి చొరవ తీసుకున్నాడు మరియు తన కుమారుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని క్షమించటానికి ఒక మార్గాన్ని రూపొందించాడు.

2. యేసు క్రీస్తు రక్తం ద్వారా దేవుని కోపం సంతృప్తి చెందింది (1 యోహాను 4:10)


పాపం శిక్షించబడాలని న్యాయం కోరుతుంది. ఆదాము అతిక్రమముతో దైవిక కోపం రగిలింపబడింది మరియు ఇప్పుడు దానిని చల్లార్చాలి.  ఎవరో ఒకరు పరిహారం చేయాలి. దేవుడు యేసు క్రీస్తును ప్రాయశ్చిత్తంగా సమర్పించాడు (రోమా 3:25).  ఆయన రక్తమందు విశ్వాసముంచుట మనకు రక్షణ.  పాపము వలన రేగిన దేవుని కోపం శాంతించింది. మన పట్ల ఆయన కోపం చల్లారింది. యేసు క్రీస్తు రక్తంపై మన నమ్మకం; దేవుడు మమ్మల్ని అంగీకరించేలా చేసింది. మనపై ఉన్న అన్ని ఆరోపణలు తొలగించబడ్డాయి. మనమిప్పుడు స్వతంత్రులమైనాము. 

3. దేవుడు మన పాపాలను ఇక జ్ఞాపకముంచుకొనడు. (హెబ్రీయులు 8:12 - యిర్మీయా 31:34)


యేసు క్రీస్తు రక్తం ఆధారంగా దేవుడు మనతో ఒక క్రొత్త ఒడంబడికను చేసాడు మరియు మన పాపాలను ఇకపై గుర్తుంచుకోనని భరోసా ఇచ్చాడు. మన పాపాలను మతిమరుపు సముద్రంలో పడవేసాడు (మీకా 7:19).  పాపానికి జరిమానా ఒక్కసారిగా చెల్లించబడింది; మరియు రికార్డ్ శుభ్రంగా చేయబడింది. మనం ఎన్నడూ పాపం చేయనట్లు ఆయన సన్నిధిలో నిలబడగలము; అందువల్ల అతను ఎంతటి పాపినైనా అంగీకరించగలడు

4. దేవుడు మన పాపముల పరిణామాలను రద్దు చేశాడు (కీర్తనలు 103: 3)


మన పాప క్షమాపణ మరియు మన రోగనివారణ కలిసి వచ్చాయి.  క్షమాపణ పొందిన తరువాత కూడా మనం పాప ప్రలోభాలను ఎదుర్కొంటున్నట్లే, స్వస్థత పొందిన తరువాత కూడా మనము వ్యాధి లక్షణాలను ఎదుర్కొంటాము (కీర్తనలు 103: 3). పాపం ఒక ప్రలోభంతో మొదలవుతుందని మరియు వ్యాధి ఒక లక్షణంతో మొదలవుతుందని అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి మనం నిరంతరం ప్రతిఘటించాలి మరియు ప్రలోభాలను రోగ లక్షణాలను ఎదిరించి అధిగమించాలి (3 యోహాను  2).  దేవునిచేత నీతిమంతులముగ తీర్చబడిన మనము అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలనేది దేవుని చిత్తము.  
మనము ఆయనలో దేవుని నీతిగా అయ్యాము మరియు ఆయన దెబ్బల చేత మనం స్వస్థత పొందామని గుర్తుంచుకోండి (2 కొరింథీయులు 5:21; 1 పేతురు 2:24). 
దేవుడు పాపాన్ని మరచి క్షమించగలిగితే, ఆయన ఖచ్చితంగా పాప పరిణామాలను కూడా రద్దు చేయగలడు. వ్యసనాలకు బానిస అయినవాడు రక్షింపబడవచ్చునేమో కానీ వ్యసనాల పరియవసానములు భరించాలని కొందరు అనవచ్చు.  దేవుడు సగం పని చేస్తాడా?  పాపాన్ని పరిహరించగల దేవుడు రోగాలను తీర్చలేడా? దావీదు దీనిని కీర్తన 103: 3 లో వివరించాడు, "మన దోషాలన్నిటిని క్షమించువాడు, మన వ్యాధులన్నిటినీ స్వస్థపరచువాడు".

5. దేవుడు మన పాపాలను మనకు వ్యతిరేకంగా ఉంచడు (రోమా ​​8: 1-2)


మనము యేసు క్రీస్తు ద్వారా జీవమిచ్చు ఆత్మను స్వీకరించినట్లయితే, మనము పాపం మరియు మరణం యొక్క నియమము నుండి విముక్తి పొందితిమి.  పాపం మరియు మరణం యొక్క నియమము అనగా మోషే యొక్క ధర్మశాస్త్రము; ఇది పాపాన్ని మాత్రమే వెల్లడిస్తుంది మరియు మరణాదండనను చేస్తుంది.  కాని జీవమిచ్చు ఆత్మ అనేది విశ్వాసం ద్వారా పాపం నుండి విముక్తి కలిగిస్తుంది. మరియు మనం కృపలో ఉన్నందున పాపం మనపై ఆధిపత్యం కలిగి ఉండదు (రోమా ​​6:14). అందువల్ల, మనము ఖండనకురాము  మరియు దేవుడు మన పాపాలను మనకు వ్యతిరేకంగా ఉంచడు.

6. దేవుడు మన ఖాతాకు ఎటువంటి పాపమును  వేయడు (కీర్తనలు 32: 2; రోమా ​​4: 6)


మనము క్రీస్తులో క్రొత్త జీవులుగా తయారైనప్పుడు, (2 కొరింథీయులకు 5: 19-21) దేవుడు మనకు వ్యతిరేకంగా చేయబడ్డ ఆరోపణలు లెక్కించకుండా చూసుకున్నాడు. పౌలు దీనిని మన ఆశీర్వాదం అని వివరించాడు. దేవుడు తన ఖాతాల పత్రిక నుండి మన పాపాలను తొలగించి, మనతో తనను తాను రాజీ చేసుకున్నాడు.  ఎందుకంటే మన పాపాలు వాటి పర్యవసానాలూ క్రీస్తుపై వేయబడినందున, మన ఖాతాలో ఎటువంటి పాపాలు మిగిలి లేవు.  ఎంతటి ఆశీర్వాదం!

7.  దేవుడు మన నుండి పాప మనస్సాక్షిని తొలగించాడు (హెబ్రీ ​​10: 1-39)


ధర్మశాస్త్రం ప్రకారం బలులు ఒకరిని శుద్ధి చేస్తే పాప మనస్సాక్షిని కూడా తొలగించాలి కదా? (వ 2). కానీ ఆ బలులు వారి పాపాలను ఇంకా జ్ఞాపకం చేస్తున్నాయి ( వ 3). దేవుడు పరలోకంలో సిద్ధంచేసిన యేసు క్రీస్తు శరీరం మాత్రమే (వ 5) మొదటి (ధర్మశాస్త్రము)  దానిని  తీసివేసి రెండవదాన్ని (కృప) ( వ 9) స్థాపించగలదు. ఆ శరీరం ద్వారానే మనం కూడా పవిత్రపరచబడ్డాము (వ 10).   (నా దాసుడైన మోషే మరణించాడు; యెహోషువ (అనగా యేసు) లెమ్ము - యెహోషువకు మోషే దారి విడవాలి.  ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడెను , కృప మరియు సత్యము క్రీస్తు ద్వారా వచ్చెను.)  యేసు క్రీస్తు ఒక్క త్యాగం ద్వారా పాపాలను శాశ్వతంగా తొలగించాడు (వ 12). మరియు ఒక్క అర్పణ ద్వారా ఆయన పరిశుద్ధపరచబడిన మనలను పరిపూర్ణం చేశాడు (వ 14). పరిశుద్ధాత్మ ఇవన్నీ ధృవీకరించే సాక్షి, ఎందుకంటే మన పాపాలు మరియు దోషాలు ఎప్పటికీ గుర్తుండవు అని తన పుస్తకంలోని 31 వ అధ్యాయంలో వ్రాయమని యిర్మీయా ప్రవక్తను ప్రేరేపించాడు. 
యేసు క్రీస్తు రక్తం ద్వారా మనం ఇప్పుడు ధైర్యంగా అతిపరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలుగుతున్నాము.  ఇది శుద్ధిచేయబడ్డ క్రొత్త మరియు నిజమైన హృదయంతో, విశ్వాసం యొక్క భరోసాతో నిండి ఉంది.  చెడు మనస్సాక్షి నుండి స్వచ్ఛమైన నీటితో కడుగబడ్డాము. 
యేసు క్రీస్తు మనకోసం చనిపోయాడని మనము నమ్ముతున్నందున మనం దేవునికి దగ్గరవుతాము. అందువల్ల విశ్వాసం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డామని కదలింపబడకుండా, మన విశ్వాస ప్రకటనను పట్టుకుందాం (వ 22-24 ). మరియు సమర్ధింపబడ్డామనే ఈ సత్యముతో  ఒకరినొకరు ప్రోత్సహించుకొందాము, ఎందుకంటే  సమర్ధింపబడ్డామనే సత్యాన్ని కృపచేత  తెలుసుకున్న తర్వాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే (వ 16), ఏ త్యాగం మనలను రక్షించదు. 
కృప యొక్క ఆత్మను మరియు ఒడంబడిక రక్తాన్ని తృణీకరించేవారు ఖచ్చితంగా శిక్షించబడతారు (వ 29 ). విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా ఉన్నామని గుర్తుంచుకోండి మరియు ఎవరైనా ఈ సత్యాన్ని తిరస్కరిస్తే, దేవుడు అతనివలన సంతోషింపడు. కానీ తిరస్కరించు గుంపులో మనము లేము (వ 38-39). సజీవంగా ఉన్న ప్రతి వ్యక్తికి ఇప్పుడు యేసు క్రీస్తు వద్దకు వచ్చి సమర్థించబడే అవకాశం ఉంది; కానీ తిరస్కరణ శాశ్వతమైన ఖండనకు దారితీస్తుంది.

8. దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాడు. (రోమా 8:14)


గమనించండి, యేసు క్రీస్తు సంపూర్తి చేసిన కార్యములో మనము నడుచుచున్నవారమైతే, శారీరిక ప్రయత్నంలో (ధర్మశాస్త్రము) మనము నడుచుకొనుటలేదు.  పాపము మరియు మరణము నుండి విడిపించగల దేవుని కృపను వెంబడించుచున్నాము (రోమా 8:1-2).  
ధర్మశాస్త్రం చేయలేనిది యేసు చేసెను. తన శరీరమందు పాపమును ఖండించి, మనలో ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పు వలనైనా నీతిని నెలకొల్పాడు.  
ఎందుకనగా మనమిక మన సొంత బలముతో ధర్మశాస్త్రమును నెరవేర్చాలని ప్రయాతం చేయుట లేదు (వ 3-4).  మనమిప్పుడు ఆత్మద్వారా దేవుని కృపలో నడుస్తున్నాము, (వ 5) లేనియెడల మనము ఆయన వారము కాదు (వ 9).  క్రీస్తు ఇప్పుడు మనలో జీవిస్తూ ఆయన నీతిని మన లెక్కలో వేసి మనల్ని దేవుని నీతిగా చేశాడు.  మరియు క్రీస్తుని మృతులలో నుండి లేపినట్లే మనల్నికూడ అమర్త్స్యతకు లేపును (వ 10-11).  అట్లైన యడల మనమిక శరీరమందు ప్రయత్నం అవసరమా? (వ 12).   
మనలో ఉన్న క్రీస్తు ఆత్మ శరీర క్రియలను చంపును కదా (వ 13).  మనము ఆత్మమూలముగా నడుచుకుంటే; శరీరక్రియలు నెరవేర్చము (గలతి 5:16).  విశ్వాసముద్వారా దేవుని కృపను ఆశ్రయిస్తే; శరీర వాంఛలపట్ల రుచి పోతుంది.   మరియు మనల్ని నడిపించటానికి దేవుని ఆత్మకు అనుమతిస్తే, మనము నిజమైన దేవుని కుమారులమవుతాము (వ 14).   దేవునిచేత దత్తతు తీసుకొనబడిన వారము గనుక మనము భయపడనక్కరలేదు; అంతేగాక ఆయనను అబ్బా (డాడీ) అని పిలువవచ్చు (వ 15).  మనము దేవుని కుమారులమని మనలో ఉన్న దేవుని ఆత్మ ద్రువీకరిస్తుంది (వ 16). 

9. దేవుడు మనల్ని స్నేహితులుగా భావిస్తున్నాడు. (రోమా 5:8-10)


మనల్ని క్షమించాలనే ఆలోచన దేవునిలో పుట్టింది గనుక, మనము ఆయనను ఎరుగకముందే ఆయన మనకొరకు చనిపోయాడు (వ 8).  శత్రువులముగా ఉన్నప్పుడు మనల్ని దేవునితో సమాధాన పరచియుంటే మనమిప్పుడు అంతకంటే ఎక్కువ, అంటే స్నేహితులము.  అంతేకాదు, మనలో, మనతో, ఉండటానికి ఆయనకు లాంటి మరొక ఆధారణకర్తను యేసు పంపెను. ఆయనను ఆర్పిన లేక దుఃఖపరచిన పరిశుద్దాత్ముడు మనలోనే, మనతోనే, నిరంతరమూ ఉంటాడు.  శాశ్విత స్నేహితులం. 

10.  దేవుడు మనల్ని ఆయన నీతిగా చేసాడు. (2 కొరింథీ 5:10-21)


ప్రతిఒక్కరము దేవుని తీర్పు సింహాసనము ఎదుట నిలువ వలసిన వారము (వ 10), కాబట్టి క్రీస్తునందు నమ్మిక ఉంచమని మనుషులను బ్రతిమాలు కొంటున్నాము (వ 11).  క్రీస్తు చనిపోయాడని మనము నమ్మితే, మనమందరము ఆయనతో చనిపోయామని నమ్మవలెను.  ఈ సంగతి మనుషులకు చెప్పటానికి క్రీస్తు ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుంది (వ 14).  మరియు క్రీస్తు తిరిగిలేచినందున, మనమందరము ఆయనతో లేచినట్లే (వ 15).  మరియు మనమెన్నడు ఎవ్వరిని శరీరసంబంధులుగా గుర్తించముగాని ఆత్మసంబంధులుగానే గుర్తిస్తాము (వ 16).  కాబట్టి, మనము క్రీస్తులో ఉన్నవారమైతే , మనము నూతన సృష్టి; పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను (వ 17).  క్రీస్తు ద్వారా మనల్ని ఆయనతో సమాధానపరచుకొన్నవాడే దీనినంతటిని చేసాడు (వ 18).  క్రీస్తు నందు దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరచుకొని మన పాపములను, అతిక్రమములు లెక్కలోకి తీసుకోలేదు (వ 19).  అంతేగాక మనల్ని రాయబారులుగా నియమించి, ఈ సమాధాన పరిచర్య మనకు అప్పగించాడు (వ 20) - అదేమనగా ఏ పాపము చేయని యేసుని పాపముగా మార్చి ఆయనకు బదులుగా మనల్ని నీతిమంతులుగా  చేసాడు (వ 21).   మనమిప్పుడు క్రీస్తుతో సహా పనివారము మరియు దేవుని కృపను వృధాచేయవద్దని మనుషులను బ్రతిమాలు కొందుము. 

Melchizedek









No comments:

Post a Comment

WHAT IS THE BETTER PART?

Jesus, Mary and Martha Recently, I was conversing with a family friend and referred to her dear husband as her 'darling'.  She immed...